అబద్ధాలు ప్రచారం చేసే హరీశ్ రావుకు గరుడ పురాణంలో శిక్ష తప్పదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

  • మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారన్న యెన్నం
  • తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శ
  • భూబకాసురుల విషయంలో హైడ్రా హిట్లర్‌లా పనిచేస్తుందని వ్యాఖ్య

బీఆర్ఎస్ అగ్రనేతల వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎల్పీ మీడియా హాల్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనడం, మూసీ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. కేవలం మీడియా హెడ్‌లైన్స్ కోసమే కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి గరుడ పురాణంలో శిక్ష ఖరారవుతుందని... హరీశ్ రావు ఆ శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.


150 మీటర్లకు తుమ్మిడిహెట్టి నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా నాటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నాడు తెలంగాణ నేత విద్యాసాగర్ రావు అక్కడ గవర్నర్‌గా ఉన్నా ఉపయోగించుకోలేదని విమర్శించారు. పదేళ్ల పాలనలో హైదరాబాద్‌కు ఒక్క ఎంజీడీ అదనపు నీటిని కూడా తీసుకురాలేదని, పాలమూరు-రంగారెడ్డి కెనాల్ పనులపై 90 శాతం పూర్తయ్యాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్ బడ్జెట్‌లో సగం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.


భూబకాసురుల విషయంలో హైడ్రా ఒక హిట్లర్‌లా పనిచేస్తుందని స్పష్టం చేశారు. గతంలో తాము హిట్లర్ కంటే కఠినంగా ఉంటామని కేసీఆర్ అన్నప్పుడు స్పందించని కేటీఆర్... ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అంటే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని యెన్నం చురకలంటించారు.


Yennam Srinivas Reddy
Harish Rao
KTR
HYDRA Telangana
Musi River Development
Telangana Politics

More Telugu News